
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో.. ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలగగా.. అకాల వర్షం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో మరో వారం రోజుల పాటు వర్షాలు పడనుండటంతో రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఐ ఎమ్ డీ అంచనా ప్రకారం.. ఈ నెల 15 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుండగా.. మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
కాగా ఈ రోజు.. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే పైన తెలిపిన ప్రాంతాల్లో వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరి అంచనాలు నిజమైతే.. ఎన్నికల నిర్వహణ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నెల 13న రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరగనుంది. ఆ రోజు వర్షం పడితే పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వర్షం కురిసిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.