
నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు కుళ్లిపోవడంతో అదే నీటిని తాగుతున్న ఘటన సాగర్లో చోటు చేసుకుంది. నందికొండ మున్సిపాలిటీ మొదటి వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ లో కోతుల మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నీటి సరఫరా అవుతున్న అదే కలుషిత నీటిని ఈ ప్రాంత వాసులు తాగుతున్నారు. వాటర్ ట్యాంకు పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి ప్రవేశించిన కోతులు బయటకు రాలేక లోపలే చనిపోయాయి. సుమారు 30 కోతుల మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించడం కలకలం రేపింది. అయినా నీటి సరఫరా కార్మికులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. ట్యాంక్ శుద్ది చేయడం మరిచారా.. ప్రజల ఆరోగ్యాలతో చేలగాటమాడుతున్నారా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు,సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

