
హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ స్థానంలో కొన్ని రౌండ్లలో ‘నువ్వా.. నేనా..’ అన్నట్టుగా హోరాహోరీగా కౌంటింగ్ సాగింది. తీరా రౌండ్లు పెరుగుతున్నా కొద్దీ వార్ వన్ సైడే అన్నట్టుగా సాగింది. ఎంఐఎం నేత అసదుద్దీన్‌కు 6,61,981 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు కేవలం 3,23,894 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో అసద్ 3,38,087 మెజార్టీతో గెలిచారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అసద్ 2,21,086 ఓట్లతో గెలుపొందగా, ఈసారి ఓవైసీ మెజార్టీ భారీగా పెరిగింది. కాగా హైదరాబాద్‌లో ఓటు బ్యాంకు తగ్గడంపై బీజేపీ సమీక్షకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమెకు ప్రత్యేక స్థానం ఇచ్చి మరీ ప్రచారం సాగించారు. అయినా భారీ ఓటమిని ఆమె చవిచూడాల్సి వచ్చింది. రాజాసింగ్ సపోర్ట్ మొదటి నుంచి దొరకకపోవడం, ఆమె తీరు శ్రేణులకు నచ్చకపోవడం కూడా ఇందుకు కారణమై ఉంటుందని చర్చించుకుంటున్నారు.

