
కేసీఆర్ పర్యటనపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రోఫెసర్. గంటా చక్రపాణి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ పర్యటనపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు కానీ అర్ధ ఎకరం కోసమైతే వస్తారన్న వ్యాఖ్యలకు సంబందించిన పేపర్ క్లిప్ కి అమ్మ అది అర్ధ ఎకరం కాదు, ఒక నిండు ప్రాణం అని యువకుడు పోస్టు చేశాడు. దానిపై ” అది నిజం కదా! ఒక నిండు ప్రాణం పోయింది. మీలాంటి వారు ఈ రాష్ట్రంలో వందలఎకరాలు, వందలకోట్లు ఉండవచ్చు. కానీ సాగు చేసే సామాన్య రైతుకు అర్ధఎకరం కాదు ఒక గుంట పొలం ఎండిపోయినా గుండె పగిలిపోతుంది. ఉన్న అర్దెకరం ఎండిపోయినందుకే కదా ఆ నిండుప్రాణం పోయింది. మనిషి ప్రాణం విలువను ఎకరాల్లో కాదు కన్నీళ్లతో కొలవాలి. ఆ కన్నీళ్లనే కదా తుడవాలి.!” అని రాసుకొచ్చారు. నిన్న పొలంబాట కార్యక్రమంలో భాగంగా దేవరుప్పలను కేసీఆర్ పర్యటించడంపై పాలకుర్ది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నాయకులంతా దేవరుప్పల వద్ద ఉన్న ధరావత్ తండాలోని ఒకే కుటుంబం దగ్గరకు వస్తున్నారని, దేవరుప్పలకు నాయకులు రావడం సినిమా షూటింగ్ ను తలపిస్తుందని అన్నారు. ధరావత్ తండాలో సత్తెమ్మ అనే రైతుకు ఎనిమిది ఎకరాలు ఉండగా.. కేవలం రెండు ఎకరాలు మాత్రమే సాగు చేసిందని, అందులో అర్ధఎకరం మాత్రమే ఎండిపోయిందని తెలిపారు. అంతేగాక కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు కానీ, అర్ధ ఎకరం కోసం వస్తారని విమర్శించారు.

