
దాదాపు 17 ఏళ్ల క్రితం టీమ్ ఇండియా 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ధోనీ నాయకత్వంలో ప్రారంభ టోర్నీలో సత్తాచాటి చాంపియన్‌గా నిలిచింది. అప్పటి నుంచి మరోసారి ఆ కప్పు చిక్కలేదు. ప్రతి సారి టోర్నీలో ఫేవరెట్‌గా అడుగుపెట్టడం.. ఏదో ఒక దశలో ఇంటిదారిపట్టడం.. ఇలా 17ఏళ్లుగా టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. మరి, ఈ సారైనా టీమ్ ఇండియా నిరీక్షణ, భారత అభిమానుల ఆశలు నెరవేరేనా?.. టీ20 వరల్డ్ కప్ మొదలైంది. ఈ కప్పు వేటకు రోహిత్ సేన సిద్ధమైంది. తొలి పోరు నేడే. న్యూయార్క్ వేదికగా బుధవారం ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్‌కు గట్టి పోటీదారు అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. రోహిత్ సేనకు గ్రూపు దశ నామమాత్రమే అని చెప్పాలి. గ్రూపు ఏలో భారత్ సహా పాకిస్తాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా జట్లు ఉన్నాయి. గ్రూపులో పాక్ మినహా టీమ్ ఇండియాకు గట్టి పోటీ లేదు. కాబట్టి, సూపర్-8 రౌండ్‌కు చేరుకోవడం ఖాయమే. నేడు తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది.

