
హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్‌యూఐ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. నీట్ ను రద్దు చేయాలి అని నినాదాలు చేస్తూ.. ర్యాలీగా వెళుతున్న యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు గాంధీభవన్ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసన కారుల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. బారీకేడ్లను తోసుకొని బీజేపీ కార్యాలయానికి ప్రయత్నించిన నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసన కారుల్లో ఓ నేత మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ మంత్రులు నీట్ ను రద్దు చేశాకే తెలంగాణలో అడుగు పెట్టాలని, నీట్ రద్దు చేసి, ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు లేకుండా విద్యార్ధులకు పారదర్శకంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేగాక నీట్ రద్దు చేసి విద్యార్దులకు న్యాయం జరిగేలా పోరాడకపోతే తెలంగాణ బీజేపీ ఎంపీలను రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. అలాగే ఈ నెల 27 వ తేదీన యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

