banner

రోజురోజుకూ కనుమరుగవుతున్న వీధి నాటకాలు

Written by

పూర్వం గ్రామాల్లోని రచ్చబండల వద్ద అంతరించిపోతున్న కలలను కండ్ల కట్టినట్లుగా చూపిస్తూ నాటక ప్రదర్శనలు నిర్వహించే వారని చెప్పుకోవడం వినే ఉంటాం. కానీ, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో ఇటీవల వడ్ల, కమ్మరి, చాకలి కులస్తులు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి బయలు నాటకం, యాదవ సోదరులు బీరప్ప చరిత్రను కండ్లకు కట్టినట్టుగా నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బీసీ కులాల వారు మాత్రమే నాటకాలు వేస్తారా.. మేము కూడా ఏమి తక్కువ తినలేదంటూ ఎస్సీ కుల సంఘాల వారు (మహారాజులు) కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ స్టేజి నాటకాన్ని గత మూడు రోజులుగా నిర్వహిస్తూ.. తమ ఆట, పాట వేషధారణతో గ్రామస్తులను మైమరపిస్తున్నారు. రేణుక ఎల్లమ్మ స్టేజి నాటకం చివరి రోజు కావడంతో మహిళలందరూ నూతన వస్త్రాలు ధరించి ఎంతో భక్తిశ్రద్ధలతో బోనం కుండలతో ఊరేగిస్తూ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. గ్రామంలో మూడు నెలల నుంచి యువకులు ఎంతో ఓర్పు సహనంతో కలలను నేర్చుకుని స్టేజీ నాటకాలను పోటీతత్వంతో తీసుకుని నాటక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిసర గ్రామాలకు కనువిప్పు చేస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం కాగానే టీవీల ముందు అతుక్కుపోయే జనాలను మళ్లీ పూర్వ కాలంలోని ఆట, పాటల వైపు మొగ్గు చూపే విధంగా ప్రదర్శనలు నిర్వహించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని కొంతమంది దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందిస్తే రానున్న రోజుల్లో ఈ నాటక ప్రదర్శనలతో జిల్లాలోని చుక్కాపూర్ గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని పలువురు కళాకారులు వేడుకుంటున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *