
సీఏఏను కచ్చితంగా అమలు చేసి తీరుతామని, అడ్డుకున్న వాళ్లను జైళ్లో వేస్తామని నిజామాబాద్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ అన్నారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా రైతురుణ మాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ఎన్ఆర్సీ, సీఏఏ అమలును అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, సీఏఏను కచ్చితంగా అమలు చేసి తీరుతామని, అది రాజ్యంగంలో భాగం అని, భారతదేశంలో చట్టం చేశారని, దానిని అడ్డుకుంటే జైలుకు పోతారని అన్నారు.
అంతేగాక కాంగ్రెస్ పార్టీ వాళ్లు అబద్దాలు చెప్పి గద్దెనెక్కారని, దానిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేఖ పనులు చేస్తే రాష్ట్రపతి పాలన అనేది కూడా రాజ్యాంగంలో ఉన్నదని గుర్తుంచుకోవాలని అన్నారు. అలాగే ఇవ్వాళ రైతులందరూ మోడీ వైపు చూస్తున్నారని, ఆర్మూరు ప్రాంతంలో చాయ్ పే చర్చ కార్యక్రమానికి పోయినప్పుడు పసుపు బోర్డు ఇచ్చినందుకు, పసుసుకు రేటు పెరిగినందుకు, అలాగే ఎమ్ఎస్ పీ పెరిగినందుకు రైతులంతా మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. బీజేపీకి 400కు పైగా సీట్లు దాటుతున్నాయని, కాంగ్రెస్ కు 30 సీట్లు గెలుచుకోగలదా అనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా సీట్లు పోతున్నాయని, ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెడితే ఎక్కడా కూడా ఒక్క సీటు వచ్చేటట్లు కనిపించట్లేదని అరవింద్ పేర్కొన్నారు.

