banner

పెళ్లి వాహనం బోల్తా….12 మందికి గాయాలు

Written by

ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫంక్షన్ హాల్ కు వస్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో 12 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన కొత్త కిషన్ కుమారుడి వివాహానికి వచ్చిన బంధువులను లింగంపల్లి గ్రామం నుండి జీఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ కు వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. గూడ్స్ వాహనంలో బంధువులను తీసుకొని వస్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. వాహనంలో సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఎక్కడం వల్ల ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కొత్త సావిత్రి,ఆదిత్య, వర్ష, కిషన్, కొత్త రాములు, లక్ష్మి, సత్యవతి, ఆడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేశ్వర్, రెడ్డిపేట గ్రామానికి చెందిన లక్ష్మీ, గాంధారికి చెందిన అంజయ్య, ఊరంచ రాములు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎస్సై చర్యలు తీసుకున్నారు. పెళ్లికి వస్తున్న వాహనం బోల్తాపడి బంధువులకు, కుటుంబ సభ్యులకు గాయాలు కావడంతో పెళ్లి పందిరిలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *